Tuesday, September 4, 2007

ప్రభుదేవా వల్లే "జిందాబాద్" ఫెయిల్! -"జయ టి.వి" ఇంటర్వ్యూలో చిరంజీవి.

"శంకర్ దాదా జిందాబాద్" చిత్ర అపజయానికి దర్శకుడు ప్రభుదేవాయే కారణమని చిత్ర హీరో చిరంజీవి అభిప్రాయం వ్యక్తం చేసారు. ఇటీవల "జయ టి.వి" మెగాస్టార్ చిరంజీవితో ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహించింది. ప్రముఖ నటి సుహాసిని చిరంజీవిని ఇంటర్వ్యూ చేసింది. ఇందులో చిరంజీవి తన జీవిత అనుభవాలను, సినీ పరిశ్రమలోకి వచ్చిన తొలి నాళ్ళలో చెన్నైలో గడచిన జీవితం, సౌత్ ఇండియన్ ఫిల్మ్ అకాడెమీలో తను, రజినీకాంత్, మోహన్ బాబులు కలిసి చదువుకున్న సంగతులు, చెన్నై పాండీ బజార్ ముచ్చట్లు, పానగల్ పార్క్ కబుర్లు అన్నీ కూలంకశంగా చర్చించిన ఈ ఇంటర్వ్యూలో "శంకర్ దాదా జిందాబాద్" చిత్రం ఫెయిల్ కావడానికి దర్శకుడు ప్రభుదేవా కూడా ఒక కారణమని పేర్కొన్నారు. ఒక హిందీ చిత్రాన్ని మరో ప్రాంతీయ భాషలోకి మార్చుతున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపట్ల ప్రభుదేవా పూర్తి జాగ్రత్త వహించలేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇందులో హీరోయిన్ పరిస్థితి మరీ దారుణమని, ఒక విధంగా ఈ సినిమా ఆమెకు యాక్టింగ్ స్కూల్ లా మారిందనే అభిప్రాయాన్ని నటి సుహాసిని వ్యక్తం చేసింది. దానికి చిరంజీవి సహితం అవుననే విధంగా స్పందించారు. ఇక తన 150వ చిత్రంగూర్చి వచ్చిన చర్చలో "ఉయ్యలవాడ నరసింహా రెడ్డి" కథను అదే పేరుతో తన భార్య సురేఖ నిర్మాణంలో నిర్మించాలని అనుకుంటున్నట్లు చెప్పారు. దీనికి తను దర్శకత్వం వహిస్తున్నానని వస్తున్న వార్తలపట్ల "ఇంకా దర్శకుడిని ఫైనల్ చెయ్యలేద"ని మాత్రం చెప్పి ఊరుకున్నారు. తన రాజకీయ ప్రవేశం గూర్చి "తనకా ఆలోచనే లేదని" పేర్కొన్నారు. ఈ ఇంటర్వ్యూ మొత్తం తమిళంలో సాగింది. కా గా చిరంజీవి ఇటీవల విశ్రాంతి కోసం బెంగులూరు వెళ్ళినప్పుడు ఈ ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగిందని "జయ టి.వి." తెలిపింది. ఈ ఇంటర్వ్యూ తమిళ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నట్లు తెలిసింది.

రాజకీయాల్లోకి రావడమే ఎన్.టి.ఆర్. చేసిన పాపమా...!?

అవుననే చెప్పాలి. భారత దేశం గర్వించదగ్గ గొప్ప నటుడు, దర్శకుడు, నిర్మాతగా ఆయనను ప్రపంచమే గుర్తించింది. అయినా కేంద్ర ప్రభుత్వం ఎందుకు గుర్తించడం లేదు. ఎన్.టి.ఆర్ నటనను ఆస్వాదించని ఒక్క తెలుగు వాడుంటాడా అని చెప్పడం కష్టం. ఆంధ్ర రాష్ట్రంలో ఓ కథుంది. ఓ పేదవాడు తన కష్టాలను తీర్చమని ప్రతిరోజూ దేవాలయంలో మ్రొక్కుకునేవాడు. అతని కష్టాలను చూసిన దేవునికి అతనిపై జాలి కలిగి ఒకరోజు ఆ పేద భక్తునికి ప్రత్యక్షమై "భక్తా, నీ భక్తికి మెచ్చాను,ఏం కావాలో కోరుకో " అనగానే ఆ పేద భక్తుడు భగవంతునివైపు బాగా పరిశీలనగా చూసి "పో పోవయ్యా, పొద్దున్నే నీకు నేనే దొరికానా, భగవంతుడంటే ఎట్టా వుంటాడు మా ఎంటోడిలాగా(ఎన్.టి.ఆర్ లాగా) వుంటాడు, నేను ఎన్ని సినిమాలలో సూల్లేదు, కృష్నుడిగా, రాముడిగా, రావణాసురునిగా, దేవుడైనా, రాచ్చసుడైనా ఎట్టావుంటాదో మాతెలుగు సినిమాలు సూసే వాళ్ళకంతా ఎరికే, నీ పగటి యేషాలు నాదగ్గర చూయించకు, యెళ్ళు, యెళ్ళి మరెవరినైనా అడుక్కో కలో, గంజో పోస్తారు" అనగానే ఆ దేవుడికి సహితం దిమ్మతిరిగిపోతుందని ఆ కథ సారాంశం. తన నటనతో తెలుగు ప్రజానీకం హృదయాల్లో అంతగా స్థానం సంపాదించిన గొప్ప నటుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు. అంతటి మహా నటుడికి ఇంతవరకూ భారతీయ చిత్ర పరిశ్రమలో గొప్పదైన "దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు" ఎందుకు రాలేదంటే సమాధానం ఏమని చెప్పాలి. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు సరే కనీసం తెలుగు సినీ పరిశ్రమలో గొప్పదైన "రఘుపతి వెంకయ్య అవార్డు" ఎందుకు రాలేదని ఎవరైనా అడిగితే ఏమని చెప్పాలి. కుళ్ళు రాజకీయాలకు ఎన్.టి.ఆర్. ప్రతిభ కానరాలేదని చెప్పాలా...లేక ఎన్.టి.ఆర్.కు ఆయా అవార్డులను సాధించే సత్తాలేదని చెప్పాలా. నిజంగా ఇది తెలుగు వారు సిగ్గు పడాల్సిన విషయం. గతంలో ఉన్న తెలుగు దేశ ప్రభుత్వంగానీ, ప్రస్థుతమున్న కాంగ్రెస్ ప్రభుత్వం గానీ ఈ విషయంలో పెద్ద ప్రాధాన్యాన్ని ఇవ్వలేదని తెలుగు సినీ పరిశ్రమ చెబుతోంది. తెలుగు వారి కీర్తి పతాకాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎగురవేసిన నందమూరి తారక రాముని పట్ల ఇంతటి హీన స్థితి నిజంగా దురదృష్టకరం. ఈ విశయంలో ప్రభుత్వాలో, లేక సినీ పరిశ్రమో అడుగు ముందుకు వేసి ఒక గొప్ప నటుడికి సరైన గౌరవాన్ని కలిగించాలని కోరుకుంటున్నాను.

రైతుబాంధవునికి సముచిత పురస్కారం

పాలగుమ్మి సాయినాథ్ కు మెగసెసె అవార్డ్ వచ్చిన నాటి నుండీ అతని గురించి ఒక పోస్టు రాయాలనుకుని వాయిదా వేస్తూ వచ్చాను. మొన్న ఆదివారం ఈనాడులో ఎం.ఎల్. నరసింహా రెడ్డి సాయినాథ్ పై చక్కని వ్యాసం రాసాడు.
మిత్రుడు ఇస్మాయిల్ పెనుకొండ ఆపాటికే సదరు వ్యాసం గురించి తన బ్లాగులో ప్రస్తావించాడు.
అయినా ఒక రికార్డ్ ఉండాలని మొత్తం వ్యాసాన్ని దిగువ ఇస్తున్నాను.
రైతు బాంధవుడు
కంప్యూటర్లూ సాఫ్ట్‌వేర్ల గురించి మాత్రమే అంతా ఆలోచిస్తున్న ఈ ఆధునిక యుగంలో… ప్రియురాలి వంటి పట్నాన్నే కాదు… తల్లివంటి పల్లెను కూడా తలచుకోవాల్సిన అవసరం ఉందనుకున్నాడో వ్యక్తి! అనుకోవడమే కాదు, అకుంఠిత దీక్షతో నెలల తరబడి గ్రామాల వెంట తిరిగాడు. ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వెళ్లాడు. అందుకు కారణమైన లోతుల్ని తరచిచూశాడు. అక్షరబద్ధం చేశాడు. పాలకుల, ప్రజల దృష్టికి తెచ్చాడు. ఆయనే పాలగుమ్మి సాయినాథ్‌. ఈ ఏడాది రామన్‌ మెగసెసే అవార్డు విజేత.
మనదేశంలో సేద్యం ఎప్పణ్నుంచో ఉంది. రైతూ ఎప్పణ్నుంచో ఉన్నాడు. సాగులో ఇబ్బందులూ అంత పాతవే. కానీ… సంస్కరణల కారణంగా తలెత్తుతున్న సమస్యలు మాత్రం కొత్తవి. వాటిని వెలికితీసి రైతన్నల వెతలను ప్రపంచానికి తెలియజేశారు పాలగుమ్మి సాయినాథ్‌. పేరు గొప్ప పాలకులు చేసే ఆర్భాటపు ప్రకటనలూ విధానాలూ ఆచరణలో, క్షేత్ర స్థాయిలో ఎలా డొల్లపోతున్నాయో ససాక్ష్యంగా నిరూపించే ప్రయత్నం చేశారు. బ్లిట్జ్‌ పత్రికలో విదేశీ వ్యవహారాల సంపాదకునిగా చేసిన సాయినాథ్‌… గ్రామీణ భారతం కోసం ఫ్రీలాన్సు జర్నలిస్టు అవతారం ఎత్తారు. టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ఫెలోషిప్‌తో దేశంలోనే అత్యంత వెనుకబడిన జిల్లాల్లో పర్యటించి 18నెలల్లో 84కథనాలతో అవినీతిపరుల గుండెల్లో దడ పుట్టించారు. మహారాష్ట్ర విదర్భ రైతుల ఆత్మహత్యల గురించి ఆయన రాసిన కథనాలతో ప్రధానమంత్రి కార్యాలయం కదిలింది. గత జూన్‌-జులై నెలల్లో ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఆ ప్రాంతాల్లో పర్యటించారు.ఓ సీనియర్‌ జర్నలిస్టు మాటల ప్రకారం సాయినాథ్‌ అంటే… ీద బ్యాడ్‌బోయ్‌ ఆఫ్‌ ఇండియన్‌ జర్నలిజం’. ఆయన మాటల వెనుక నేపథ్యం తెలుసుకునే ముందు ఇంకా చాలా విషయాల గురించి ఆలోచించాల్సి ఉంది.
ప్రత్యక్షంగానో పరోక్షంగానో మనదేశంలో 60 శాతం మందికి పైగా వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నారు. కానీ మన పాలకులకు ఆ రంగమంటేనే అలవిమాలిన నిర్లక్ష్యం. సాఫ్ట్‌వేర్‌పైనో, సిమెంటు, ఉక్కు ఫ్యాక్టరీలపైనో, మరో రంగంపైనో చూపించిన శ్రద్ధలో కనీసం వందోవంతు కూడా దానిపై చూపించరు.
మనం రోజూ పత్రికలు తిరగేస్తుంటాం. ఏదో ఒక మూల “అప్పుల బాధ భరించలేక… ఆత్మహత్య” అని సింగిల్‌కాలం వార్త కనిపిస్తుంది. కానీ మనం దాన్ని కనీసం చూడనైనా చూడం. అలా చనిపోయింది ఎవరో, ఎందుకలా బలవంతంగా ప్రాణాలు తీసుకోవాల్సి వచ్చిందో ఒక్కసారి కూడా మనసు పెట్టి చదవం. రోజూ తినే కూరగాయలు ఎలా వచ్చాయో, వాటిని పండించడానికి ఎందరు, ఎంత కష్టపడుతున్నారో వాళ్లకు జరుగుతున్న అన్యాయమేంటో ఆలోచించం.
ఆ రైతులే ఒక ఏడాదో, రెండేళ్లో సమ్మెచేస్తే…మేము ఈ పని చేయం, వేరేది చూసుకుంటాం అని భీష్మిస్తే…మన నోట్లోకి నాలుగు వేళ్లూ పోవు.రుచులు తీరవు. కడుపులు నిండవు.మన జేబులిలా నిండుగా ఉండవు.ఆరుగాలం స్వేదం చిందించినా…ఎవరి ఆదరణకూ, కనీసం సానుభూతికి నోచని ఆ అభాగ్యజీవులే మన రైతన్నలు. మన అన్నదాతలు!రుణమనే పొలాన్ని.. శరీరమనే నాగలితో దున్ని… ఎర్రటి ఎండలో చిందిన చెమట చుక్కల్ని సాగునీరుగా పోసి… శ్రమను నాటేసి… అలుపెరుగని కష్టాన్ని ఎరువుగా వేసి… నష్టమనే దిగుబడి పొంది… ఆత్మహత్య అనే ఆదాయాన్ని సంపాదించుకుంటున్నాడు మన రైతన్న!సేద్యమనే ఉద్యోగం వెుదలుపెట్టి… దాన్ని చేయలేక, చేసే చేవలేక… మధ్యలోనే బలవంతంగా స్వచ్ఛంద పదవీ విరమణ చేసి… అర్ధాంతరంగా బతుకు నుంచి విరమించుకుంటున్నాడా మట్టిమనిషి! ఆ రైతన్న కథ, వ్యథ, విషాద గాథ కూడా వార్తేననీ, పాలకులు, ప్రజలతో పాటు అందరూ పట్టించుకోవాల్సిన అంశమేననీ అనుకున్నారు సాయినాథ్‌. అదే ఆయనకు బ్యాడ్‌బోయ్‌ అన్న బిరుదు సంపాదించి పెట్టింది.
* * *ప్రఖ్యాతిగాంచిన ఆర్థిక వేత్త, నోబెల్‌ పురస్కార గ్రహీత అమర్త్యసేన్‌ మాటల్లో చెప్పాలంటే ఆకలి, దుర్భిక్షంపై ప్రపంచంలోనే అత్యంత లోతుగా అధ్యయనం చేసిన నిపుణుల్లో సాయినాథ్‌ ఒకరు. తాను ఎవరి గురించి రాస్తారో వారిని గౌరవిస్తారాయన. వారితో మమేకమై వాళ్లు చెప్పింది ఓపిగ్గా వింటారు. వారి సమస్యలకు కారణమైన విధానాలపైన, కారకులైన పాలకులపైన తీవ్రంగా స్పందిస్తారు. పాలకులను నిద్రలేపేలా ఆయన కథనాలు ఉంటాయి. ఆయన కలం, గళం రెండూ శక్తిమంతమైనవే. పేదలు, అణగారిన వర్గాల సమస్యలపై ఎంత తీవ్రంగా స్పందించి రాస్తారో, వారి తరఫున అంత కంటే గట్టిగా మాట్లాడతారు. రాతలోనూ, మాటల్లోనూ నిర్మోహమాటంగా తన అభిప్రాయాలు చెప్తారు. ీదేశం వెుత్తం మీదా గత పదేళ్లలో దాదాపు లక్ష మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కానీ అందుకు కారణమైన ఒక్క అధికారికి కూడా కనీస శిక్షపడలేదు’ అన్న సాయినాథ్‌ మాటలు కఠినంగా అనిపించొచ్చుగానీ అవి అక్షర సత్యాలు.
గ్రామాల్లోనే…
గత 14 సంవత్సరాలుగా సాయినాథ్‌ ఎక్కువ కాలం గ్రామాల్లోనే గడిపారు. ఏడాదికి దాదాపు 250 నుంచి 270 రోజులు పల్లెల్లోనే తిరుగుతారు. ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, ఒరిస్సా, మహారాష్ట్ర, బీహార్‌, ఉత్తరప్రదేశ్‌… ఇలా ఒకటికాదు రెండుకాదు, ఇన్నేళ్లల్లో ఆయన తిరిగిన దూరం దాదాపు 3లక్షల కిలోమీటర్లు. క్షేత్రపర్యటనలో ప్రజలు చెప్పేది ఓపిగ్గా వింటారు. వారి బాధల్ని ప్రత్యక్షంగా చూస్తారు. తాను రాసే విషయంలోగానీ అంకెల్లో గానీ ఎక్కడా పొరబాట్లు రాకుండా జాగ్రత్తపడతారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే విధాన నిర్ణయాలూ వాటిపై ప్రపంచ వాణిజ్య సంస్థ, ప్రపంచబ్యాంకు లాంటి సంస్థల ప్రభావాల గురించి లోతుగా అధ్యయనం చేసిన సాయినాథ్‌ ఒక సమస్యను భిన్నకోణాల్లో ఆలోచించి రాస్తారు. ఇన్ని మాటలెందుకు… పాలమూరు వలసలూ అనంతపురంలో రైతుల ఆత్మహత్యలూ అంతర్జాతీయ సమాజం దృష్టికి రావడానికి ఆయన రచనలే కారణం. వలస కూలీలుగా మారిన మహబూబ్‌నగర్‌ జిల్లా రైతులు 2000సంవత్సరంలో వారానికి ఒక బస్సులో ముంబాయి వెళ్లేవారు. 2004కి ఆ సంఖ్య 34బస్సులకు పెరిగింది. ఈ విషయాన్ని గుర్తించి ప్రపంచానికి చెప్పింది సాయినాథే. ఈ సమస్య తీవ్రతను తెలుసుకొనేందుకు వలసకూలీలతో కలిసి ఆయన బస్సులో ముంబయికి ప్రయాణం చేశారు. బస్సు డ్రైవరును కూడా వదలకుండా ప్రతి ఒక్కరితో మాట్లాడి కథనాలు రాశారు.
పాముకాటుతో రైతులు మరణించడానికీ ఆర్థిక సరళీకృత విధానాలకూ తీవ్రవాదానికీ సంబంధం ఉందంటే ఎవరూ నమ్మకపోవచ్చు. కానీ సాయినాథ్‌ పరిశోధనలో ఈ మూడింటికీ సంబంధం ఉందని తేలింది. తెల్లవారు జామున ఏ మూడింటికో కరెంటు ఇస్తోంది ప్రభుత్వం. వోటారు స్విచ్‌ వేయడానికి రాత్రిళ్లు పొలానికి వెళ్లిన రైతులు పాముకాటుకు గురైతే విరుగుడు మందు దొరకట్లేదు. పీపుల్స్‌వార్‌ నుంచి ఎల్టీటీఈ దాకా పాముకాటు మందును పెద్దఎత్తున కొనుగోలు చేసి నిల్వ ఉంచుకోవడమే దానికి కారణమని తేలింది. ఈ చేదునిజం గురించి 2001లో ఆయన రాసిన కథనం అంతర్జాతీయంగా ప్రచురితమైంది. ఇలా గ్రామీణుల దుర్భర జీవితాల్ని కళ్లకు కట్టడమే కాదు, ప్రభుత్వాల మెడలు వంచి పట్టించుకునేలా చేయడానికి ఆయన అహర్నిశలూ కృషిచేస్తున్నారు.
మనవాళ్లే…
పూర్వీకులు ఆంధ్రులే అయినా సాయినాథ్‌ పుట్టిందీ పెరిగిందీ చెన్నైలో. మాజీరాష్ట్రపతి వి.వి.గిరి మనవడాయన(కూతురి కొడుకు). సాయినాథ్‌ తండ్రి పాలగుమ్మి సూర్యారావు కాకినాడ వాస్తవ్యులు. తాత జగన్మోహనరావు స్వాతంత్య్ర సమరయోధుడు. ఆ ప్రభావమేనేవో… అన్యాయాన్ని నిలదీసే దృక్పథం సాయినాథ్‌కు విద్యార్థిదశలోనే అలవడింది. ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలో రోమిల్లాథాపర్‌, కె.ఎన్‌.ఫణిక్కర్‌, సర్వేపల్లి గోపాల్‌, బిపిన్‌చంద్ర వంటి చరిత్రకారుల శిష్యరికం ఏ సమస్యనైనా భిన్నమైన కోణంలో చూసే అలవాటు నేర్పిందాయనకు. బలమైన వామపక్ష విద్యార్థి ఉద్యమానికి కేంద్రమైన జె.ఎన్‌.యు.లో చదువు ప్రగతిశీల భావాల వైపు వెుగ్గేలా చేసింది. అక్కడే హిస్టరీలో ఎమ్మే పూర్తిచేసుకొని యునైటెడ్‌ న్యూస్‌ ఆఫ్‌ ఇండియా(యు.ఎన్‌.ఐ.)లో చేరారు సాయినాథ్‌. వివిధ పత్రికలకు యు.ఎన్‌.ఐ. అందించిన వార్తల్లో ఎన్ని ప్రచురితమయ్యాయో లెక్కగట్టడం ఆయన పని. సెలెబ్రిటీల వార్తలకు ఇచ్చినంత ప్రాధాన్యం రైతులకూ ఇవ్వడంలేదనే విషయాన్ని సాయినాథ్‌ అప్పుడే గమనించారు. అదే సమయంలో… మనదేశంలోని 2,937 పాఠశాలల్లో అసలు ఉపాధ్యాయులే లేరంటూ ీనేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌’ విడుదల చేసిన నివేదిక ఆయన జీవితదృక్పథాన్నే మార్చేసింది. ఆ రిపోర్టు ఆధారంగా ఆవేదనతో ఆయన రాసిన వ్యాసం దేశంలోని ప్రముఖ పత్రికల్లో పతాకశీర్షికయింది. జర్నలిజం పట్ల ఆయనకు మమకారం ఏర్పడటానికి అదే కారణమైంది. దాంతో బ్లిట్జ్‌ పత్రికలో చేరారు. ఇదంతా 1983 నాటి మాట. పదేళ్లపాటు అందులోనే పనిచేశారాయన. 1993లో బ్లిట్జ్‌ పత్రిక నుంచి బయటకు వచ్చి ఫ్రీలాన్స్‌ జర్నలిస్టుగా జీవితం ప్రారంభించారు. టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ఫెలోషిప్‌ కోసం జరిగిన ముఖాముఃలో… గ్రామీణ భారతం సమస్యల్ని వెలికితీయడంలో తన భవిష్యత్తు ప్రణాళిక గురించి వివరించినప్పుడు, ీదీనిపై మా పాఠకులకు ఆసక్తి ఉండదనుకుంటా’ అని ఓ బోర్డు సభ్యుడు అన్నాడు. ీవారి తరఫున మాట్లాడటానికి మీరు వాళ్లను ఆఖరిసారిగా ఎప్పుడు కలుసుకున్నారు’ అని ఘాటుగా సమాధానమిచ్చి మరీ ఫెలోషిప్‌కు ఎంపికయ్యారు. ీమీరు రాసిన అన్ని వ్యాసాలూ ప్రచురించలేం’ అన్న టైమ్స్‌ పత్రిక ఆ తర్వాత ఆయన రాసిన ఏ వ్యాసాన్నీ కాదనలేకపోయింది. అభివృద్ధి పేరుతో ప్రభుత్వ నిధుల్ని నాయకులే స్వాహాచేయడం, కరవు, పేదరికం… తదితర అంశాలతో రాసిన ఆ కథనాలే ీఎవ్రీబడీ లవ్స్‌ గుడ్‌ డ్రాట్‌’ పేరుతో పుస్తకంగా వచ్చాయి.అభివృద్ధి జర్నలిజం స్వరూపాన్నే మార్చేసిన సాయినాథ్‌ ఆ అంశంపై జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విస్తృతమైన చర్చ జరిగేలా చేశారు. ఈ విషయంలో ప్రసార సాధనాలను విమర్శించడానికి కూడా ఆయన వెనుకడుగు వేయలేదు. ీముంబాయిలో లాక్మే ఫ్యాషన్‌షో జరిగితే అధిక సంఖ్యలో అక్రిడేటెడ్‌ జర్నలిస్టులు హాజరయ్యారు. జాతీయ పత్రికలు, టెలివిజన్‌ ఛానళ్లలో ప్రముఖంగా ప్రచారం ఇచ్చారు. కనీస వేతనాల కోసం లక్షల మంది వ్యవసాయ కూలీలు ఢిల్లీలో ఆందోళన చేస్తే ఎవరూ పట్టించుకోలేదు’ అంటూ నిశితంగా విమర్శించారు. భారతదేశంలోని పత్రికలు పైనున్న ఐదుశాతం మంది గురించి పట్టించుకుంటే, తాను కింది నుంచి ఐదుశాతం మంది కోసం రాస్తానని బహిరంగంగానే ప్రకటించారు. ప్రతి జర్నలిస్టు ఫొటోగ్రాఫర్‌ అయి ఉండాలనే సాయినాథ్‌ , గ్రామీణ భారతంలో మహిళల వెతలను చిత్రీకరించారు. వివిధ రాష్ట్రాల్లో గ్రామీణ పేద మహిళల గురించి ప్రత్యేకంగా ఫోటో ఎగ్జిబిషన్‌ రూపొందించారు.
ఓ గిరిజన మహిళ. చెరువు దగ్గర నుంచొని కొంతమేర చీరను ఒంటికి చుట్టుకొని మిగిలిన భాగాన్ని ఉతుక్కుంటోంది. ఒరిస్సాలోని మల్కనగిరి జిల్లాలో నాకు కనిపించిన దృశ్యమిది. అలాగే… బీహార్‌లోని గొడ్డా జిల్లా లాల్మతియా గ్రామంలో ఓ వ్యక్తి మూడు బొగ్గుమూటల్ని సైకిల్‌మీద పెట్టుకొని అతి కష్టంగా లాక్కుని వెళ్తున్నాడు. మూడు క్వింటాళ్ల బరువుంటాయవి. అతనికి సాయం చేద్దామని ఐదునిమిషాలు తోయగానే అలసిపోయాన్నేను. కానీ అదే బరువుతో రోజూ 40కి.మీ. దూరం ప్రయాణించి వాటిని అమ్ముకుంటాడు అతను. అందుకు ముట్టే ప్రతిఫలం రూ.10. ఆ ప్రాంతంలో దాదాపు మూడువేల మందికి అదే ఆధారం’ అని చెబుతారు సాయినాథ్‌. వినడానికే గుండెలు తరుక్కుపోయే ఇలాంటి ఎన్నో దృశ్యాలను చూశారాయన. ఆ ఆవేదన నుంచి పుట్టిన ఆవేశం, పదును ఆ కలంలో కనిపిస్తాయంటే ఆశ్చర్యమేముందిక!

- ఎం.ఎల్‌.నర్సింహారెడ్డి, న్యూస్‌టుడే సౌజన్యంతో.

కృష్ణాష్టమి సందడేదీ?

చిన్నప్పుడు కృష్ణాష్టమి వస్తుందంటే చాలు అంతా హడావిడిగా వుండేది.పది పదిహేను రోజులముందునుంచే తయారు అయ్యేవాళ్లం.ఒక రేకు అమూల్ డబ్బా తీసుకుని దాని మూతకి చిల్లు పెట్టి దాన్ని తీసుకుని చందాలు పోగుచెయ్యటానికి రోడ్డు మీద పడేవాళ్లం.రోడ్డు మీద వెళ్ళే వాళ్లని బలవంతంగా ఆపి వాళ్ల దగ్గర డబ్బులు గుంజేవాళ్లం. సైకిల్ మీద వెళ్లే వాళ్ల వెంటపడి విసిగించి మరి చందా వసూల్ చేసి మొత్తనికి డబ్బు పోగుచేసేవాళ్లం.రెండు రోజులముందు ప్రసాదాలకి కావలిసిన సరుకులు తెచ్చి ఎవరోఒకళ్ల ఇంట్లొ ఆ పని అప్పగించేవాళ్ళం.ఇక పండగ రోజు ఉట్టి కొట్టే సన్నివేశం భలేగుండేది.ఉట్టిలొ పెరుగు,డబ్బులు అవి వేసి పైన కట్టి లాగుతుంటే దానిని కొట్ట్డానికి ఎగబడేవాళ్లం.ఎవరు పగలకొడితే వాళ్లే హీరొ.అది పగిలాకా డబ్బులు ఎరుకోవటనికి పెద్ద గొడవ.ఆ డబ్బులు వాడకూడదు అని చెబితే దేవుని దగ్గర హుండిలొ వేసేసి ప్రసాదాలకోసం కొట్లాట.అప్పట్లో చానల్స్ వుండేవి కాదు కాబట్టి సినిమాలంటే పిచ్చి .ఒకరు ఇద్దరు ఇంట్లొ టివి వుండేది.వాళ్ళని బతిమాలి బామాలి ఒప్పించి వీడియొ ప్లేయర్లు,కేసెట్లు తెచ్చి రాత్రంతా సినిమాలు చూస్తూ జాగారం.అలా సరదాగ గదిచిపొయేది. ఇప్పుడు పండగ లేదు పబ్బం లేదు.రోజులు యాంత్రికంగా గడిచిపోతున్నాయి.

రసపట్టులో తర్కం ఎందుకు కూడదు?

ఇంట గెలిచి రచ్చగెలవాలంటారు పెద్దలు. కాని, కవులు, రచయితలు రచ్చగెలచినా, గెలవకపోయినా ఇంట్లో మాత్రం వాళ్ళని ఎవరూ పట్టించుకోరు. వాళ్ళ రాతలని ఇంట్లో ఎవరూ చదవరు, కనీసం కన్నెత్తి చూడను కూడా చూడరు. మా ఇంట్లోనూ అంతే.“పోనీ కవితలు వద్దులే, కనీసం వ్యాసాలైనా చదవరాదూ ఓ సారి” అని ఎన్నోసార్లు ప్రాధేయపడ్డాను.“మరో సారి చూద్దాంలే, నేనిప్పుడు చాలా బిజి”పట్టువదలని విక్రమార్కుడు మరోసారి, ఇంకోసారి, వందోసారి కూడా ప్రయత్నించేడు. ఫలితం శూన్యం.సిరిసిరిమువ్వగారి బ్లాగులో ఆదివారం ఆడవాళ్ళకి సెలవు టపా చదివేక, ట్యూబులైటు వెలిగింది.“పోని, ఈరోజు వంట నేను చేస్తాను కాని, నువ్వు నే రాసిన వ్యాసాలు చదువు – ఎన్నోలేవు, నాలుగే”అప్పుడు దిగొచ్చింది కాంతామణి.“అలాక్కాదుగాని, మీరు చదివి వినిపించండి, నేను వింటాను” అంటూ సోఫాలో బాసింపట్టేసుకొని కూచొంది.అదే మహాప్రసాదం.ధాటీగా, ఉదాత్త అనుదాత్త స్వరాలతో, హావ భావాలు ఉట్టిపడేలా చదివి వినిపించేను.
“బావుంది, ప్రశ్నలేవేన్నా అడగొచ్చా… ఎన్నోకాదులే, ఒక్కటే”ఆవిడ కళ్ళలో మెరుపు చూసి నాకు గుండెలో దడ పుట్టింది. ఆవిడ మేథమెటిక్స్ ఒలింపియాడ్‌లో ద్వితీయ బహుమతి గెలుచుకొంది, లాజిక్కులు, తర్కాలు లాటివి అక్కడ చెల్లవు – డొక్క చించి డోలు కట్టెస్తుంది.మేకపోతు గాంభీర్యంతో “దానికేం, అడుగు – ఏమిటి సందేహం?”“ఇంత పెద్ద వ్యాసం రాసేరు కదా, ఇంతకీ రసం అంటే ఏమిటండీ?”ఇల్లాలా, తేనెపూసిన కత్తా?“ఓ, అదా… మెదట్లో రసాలు ఎనిమిది, తర్వాత ఎవరో దానికొకటి చేర్చి మెత్తం తొమ్మిది అన్నారు, మరికొంత మంది లాక్షిణికుల ప్రకారం పదమూడు. అవేంటంటే - శృంగారం, వీర్యం, భయానకం…….”“నేనడిగింది లెక్కలు, పేర్లు కాదు, రసం అంటే ఏమిటో చెప్దురూ ముందు” నేనింకా ముగించకముందే అడ్డుకొంది.“రసం అంటే… అంటే ఏముందీ… రసం అంటే. జ్యూసు, ఎసెన్సు, ఫండమెంటల్ క్వాలిటీ, ఎట్రిబ్యూటు, ఒక అంశ, లక్షణం, ప్రస్పుటమైన భావప్రకటన…” ఇంకా ఏదో వాగుతూనే ఉన్నాను.“పిల్లి అంటే మార్జాలం, ఎలక అంటే మూషికం, కుక్క అంటే శునకం… మరో మాట చెబ్దురూ” నా పిలక దొరికింది అని అర్ధం అయిపోయింది కాబట్టి, మెహం చింకిచాటంత చేసుకొని నవ్వుతూనే అడిగింది.
లాజిక్కుతో గెలవలేకపోతే, రెఠోరిక్‌తో ఆత్మరక్షణ చేసుకోవటంలో తప్పులేదు.“సరే, నే చెప్పేది నీకర్ధం కావట్లేదు. నువ్వు లెక్కల్లో క్వీనువి కదా, మూడు అంటే ఏమిటో నువ్వు చెప్పు, నువ్వు చెప్పిన పద్ధతిననుసరించే నేనప్పుడు రసమంటే ఏమిటో చెప్తాను, అప్పటికైనా నీ కర్ధమవుతుందేమో” అని చక్రం అడ్డేసా.“ఓస్ అంతేనా, ఒకటికి ఒకటి కలిపితే రెండు, రెండుకి ఒకటి కలిపితే మూడు. ఇంకా…”ఓడలు బళ్ళైతే, బళ్ళు ఓడలవుతాయి. ఇప్పుడు అవకాశం మనది.అవిడ మాట పూర్తికాకముందే నేనందుకొని “ర పక్కన స పెడితే రస, స కి సున్నా పెడితే రసం” అని చావుతప్పి, కన్ను లొట్టపోయి అప్పటికెలాగో తప్పించుకొన్నాను.రానే వచ్చింది ఆవిడక్కోపం.అందుకే రసపట్టులో తర్కం కూడదు.****
ప్రపంచంలో అన్నిటిని నిర్వచించటానికి వీలుపడదు. ఎందుకంటే, అన్ని విషయాలు బుద్ధికి (కాగ్నిషన్)కి సంబంధించినవి కావు గదా? బుద్ధికి, వివేచనకి, తర్కానికి అతీతమైనవి మానవుని మనోవ్యాపారలలో చాలా ఉన్నాయి. అంతఃప్రభోధం (ఇంట్యూషన్), చిత్తం, అహం లాటివి కూడా ఉన్నాయి కదా? సృజనాత్మకత అనేది హేతుబద్ధమైన బుద్ధియొక్క సహాయం తీసుకొన్నప్పటికీ, దానికతీతంగానే ఉంటుందెప్పుడూ. కళలన్నీ సృజనాత్మకతమీద ఆధారపడినవే కదా? సౌందర్యం, ఆనందం, అహ్లాదం, కోపం, విషాదం లాటి అనుభూతులు కూడా కేవలం బుద్ధితోను, తర్కంతోనూ అవగాహన చేసుకోలేం.
వింటున్నాం కదా అని చెవులో పువ్వులు పెట్టకు సారు, బుద్ధికి అతీతంగా ఏదైనా ఎలా ఉంటుంది అంటారా? ఒకటి రెండు ఉదాహరణలు పరిశీలిద్దాం:
ఒక్కోసారి ఒక లెక్కచెయ్యడానికో, ఏదైనా సమస్యకి పరిష్కారం కనుక్కోడానికో బుర్రబద్దలు కొట్టుకొంటాం, ఎంత ప్రయత్నించినా అది తేలదు – పది రోజులు పట్టొచ్చు, పదిహేను రోజులు పట్టొచ్చు, ఒక్కోసారైతే కొన్ని సంవత్సరాలైనా పట్టొచ్చు. ఉన్నట్టుండి, ఓ రోజు ఉదయం నిద్రలేవగానే – హటాత్తుగా పరిష్కారం దానంతటదే స్పురిస్తుంది. ఇది చాలా మందికి అనుభవమే.
అలాగే, ఒక్కోసారి – ఎంతోకాలం నుంచి ప్రయత్నిస్తున్నా అవగతం కాని సంగతులు, ఒక్క క్షణంలో మెరుపులా ఏదో మెరసినట్టై మెత్తం అంతా మంచు విడినట్టు, క్లిష్టతంతా విడిపోయి, అద్దంలో మెహం చూసుకొన్నంతా స్పష్టంగా అర్ధమయిపోతాయి. ఇదికూడా సుమారుగా అందరికీ విదితమే.
మాటలు నేర్చి, ఓ రెండు డిగ్రీలు చేతబట్టుకొన్న తర్వాత అన్నీ బుద్ధితో పరిష్కరించుకోవచ్చు అనిపిస్తుంది గాని, నిజానికి, చిన్నప్పుడు – మనకి భాషరానప్పుడు, మనం ప్రపంచాన్ని ఎలా అవగతం చేసుకొంటాం? భాష ఎలా నేర్చుకొంటాం? అందరికీ, పుట్టినప్పుడే, లాజిక్ సూత్రాలన్నీ తెలియవు గదా?
కళలన్నీ, ముఖ్యంగా కవిత్వం తర్కానికి అతీతంగా ఉంటుంది. మనం అలవాటు పడ్డ సరళరేఖలాటి తర్కం నుంచి మనల్ని బయటకి పడేయడంలోనే కవిత్వంలోని అసలు పరమార్ధమంతా ఉంది. తార్కిక శృంఖలాలనుంచి బయటకి లాగటం ద్వారా, ఒక్కసారిగా మనకెంతో భావ ప్రపంచాన్ని – ఒక రసగుళికగా మార్చి మనకందుబాటులోకి తేగలిగేదే అసలైన కవిత్వం – నా ఉద్దేశ్యంలో. దీనికోసం మెటాఫర్లనో, భావ చిత్రణలనో, మరేవో సాధనాలనో ఉపయోగిస్తాడు కళాకారుడు. అందుకే కవిత్వం అర్ధం కాదని చాల మంది గొడవ పెడతారు.
ఈ మధ్య, చావాకిరణ్ గారు ఆంగ్లంలో ఓ కవిత రాసేరు. అందులో, ఒక పాదంలో “ది కాఫిన్ హాస్ టు బి బాట్ అవుట్” అనుంటుంది. దానికి కొత్తపాళీగారు “అప్పుతచ్చు దొర్లినట్టుంది సార్ – బ్రాటవుట్ అనుండాలి కదా” అన్నారు.ఇది తర్కం. దానికేం సమాధానం చెప్తారు?“అవునండి, అప్పుతచ్చే, చూపినందుకు ధన్యవాదాలు” అంటూ కిరణ్ గారు చల్లగా తప్పుకొన్నారు.కాని ఆ తప్పు దిద్దలేదు.ఇంతకీ అది “బాట్ అవుటా”, లేక “బ్రాటవుటా”?ఏమో, వివరించాలంటే ఓ పదిపేజీలు పట్టొచ్చు. పదిపేజీల వ్యాసం రాయకూడదనే కదా, ఒక మాటలో కవితగా చెప్పేది?ఆ ఒక్క మాట అర్ధం అవుతే, వంద పేజీల తర్కంతో చెప్పలేనిది అవగతమౌతుంది, ఒక్క క్షణంలో.లేకపోతే, ఎంత చెప్పినా ఏమీ అర్ధం గాదు.
అలాగే, నేను చెప్పిన కపాలమోక్షంలో, “నీడనివ్వని నిటారు చెట్టు, వనదేవత వడిలో ఒరిగితే” అని రాస్తే, ఒడి అనుండాలి కదండీ, వడి అని తప్పురాసేరు అన్నారు చాలామంది. ప్రజాభిప్రాయానికి తలొగ్గొడమా? లేక వివరణలు ఇచ్చుకోవాలా?
ఇప్పుడిన్ని ప్రశ్నలడిగేవాళ్లందరూ, చిన్నప్పుడు అమ్మ “కాళ్ళాగజ్జీ కంకాళమ్మా, వెలుగూ చుక్కా వేగూమొగ్గా” అని పాడుతూ ఉంటే, తలలూపేరెందుకో? అసలీ కంకాళమ్మ ఎవరు, వేగు చుక్కేంటి అని ప్రశ్నలెందుకు సంధించలేదో? అప్పుడవసరం లేని ఎనాలిసిస్ ఇప్పుడెందుకు?
ఇది ఒక సమస్య. ఇలాటి సమస్యే తత్వాశాస్త్రాలలోనూ ఉంది. ప్రపంచంలోని మెత్తం తత్వ సిద్ధాంతాలన్నిటినీ రెండుగా విడగొడితే, బుద్ధి, వివేచనకి, తర్కం, తార్కిక నిరూపణలకి పెద్దపీటవేసిన సిద్ధాంతాలు ఒక వర్గమైతే, అనుభవం, అంతఃప్రభోధం, చిత్తప్రవృత్తి, అహంకారం, అంతఃచేతన (సబ్‌కాన్షస్)లాటి వాటికి పెద్దపీట వేసిన సిద్ధాంతాలు మిగిలినవి.
సౌలభ్యంకోసం పాశ్చాత్య తత్వశాస్త్రం ముఖ్యంగా బుద్ధి, వివేచనలకి సంబంధించినదిగాను, ప్రాచ్య సంస్కృతల తత్వసిద్ధాంతాలు అనుభవానికి సంబంధించినవిగాను చెప్పుకొన్నప్పటికీ, ఇటు మన తాత్వికులలోనూ తార్కికులు, నాస్తికులూ ఉన్నారు – హేతుబద్దమైన, సైద్ధాంతికపరమైన నిరూపణలని ప్రతిపాదించిన వాళ్ళు ఇక్కడ ఉంటే, అనుభవం, అహంకారం, అంతఃచేతనని విచారించిన వాళ్ళు పాశ్చాత్యలలోనూ ఉన్నారు.
పాశ్చాత్య తాత్వికులు ఎక్కువగా – మానవుని బుద్ది, విచారం, వివేచన ఎలా పనిచేస్తాయనే విషయం మీదనే ప్రధానంగా తమ దృష్టిని కేంద్రీకరించేరని చెప్పవచ్చోమో. ప్రాచ్య సంస్కృతులతో పోలిస్తే – పాశ్చాత్య తాత్విక సంస్కృతి ఎక్కువగా - ఈ మధ్యకాలంవరకూ - బుద్ధికి అతీతంగా ఉండే మిగతా మనో వ్యాపారలని – అంతఃప్రభోదం, భావోద్వేగాలు, చిత్తప్రవృత్తి, అహంకారం మెదలైన చేతనావస్థలని అంత లోతుగా పట్టించుకోలేదు. ఒక రకంగా దీనికి కారణం అరిస్టాటిలు. సోక్రటీసు ప్రారంభించిన ‘డయలెక్టికల్’ పద్దతిని, పూర్తి స్థాయి విశ్లేషణగా రూపొందించేడు అరిస్టాటిల్. ఆ తర్వాత కాలంలో, డేకార్త్ పుణ్యమా అని హేతువాదం (రేషనలిజం, రీజన్, లాజిక్), తార్కిక పద్దతులు వేళ్ళూనిన తర్వాత, విజ్ఞానం శాఖోపశాఖలుగా చీలిపోయింది.
తత్వశాస్త్రంలో వర్గీకరణకి చాలా ప్రాధాన్యత ఉంది. విభజించి పాలించు అనే ఒక మౌలిక సూత్రం ఉంది కదా? విచారించ దలచుకొన్న విషయాన్ని ముందు వర్గీకరించుకోవాలి. అంటే, దాన్ని, చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టాలి. ఇలా విడగొట్టడానికి ప్రతి తాత్వికుడి దగ్గరా ఒక పదునైన కత్తి ఉంటుంది – దానిపేరు విశ్లేషణ. ఆ కత్తితో మొత్తం, ప్రపంచాన్ని, సృష్టిని ముందు రెండు ముక్కలు చేస్తాడు. ప్రతి ఫిలాసఫరు చేసేపనిదే. మనిషి, ప్రపంచం అని రెండుముక్కలు చెయ్యొచ్చు. నేను, నేను కానిది అని రెండు ముక్కలు చెయ్యొచ్చు. లేకపోతే, బుద్ది, అనుభూతి అని రెండుముక్కలు చెయ్యొచ్చు. ఇంద్రియగోచరమయ్యేది, కానిది అని ముక్కలు చేసుకోవచ్చు. ఇలా మనకెలా కావాలంటే, అలా ఈ అనంతమైన విశ్వాన్ని ముక్కలు, ముక్కలుగా నరికేసుకోవచ్చు.
ఇందులో, ఒక చిన్న చిక్కుంది. పండుని ఒకసారి కోస్తే, దాన్ని తిరిగి ఎలా పండుగా చెయ్యలేమో, ఒకసారి వర్గీకరణ అనే కత్తివేటు పడ్డాక, దాన్ని మరికొన్ని ముక్కలుగా చేసుకొంటూ పోవడమేకాని, దాన్ని తిరిగి మెదటికి తేలేం. ఇంక రెండో సమస్యేమిటంటే – మొదటివేటు ఎక్కడ వెయ్యాలి అనేది. ఎందుకంటే, మిగతా వర్గీకరణంతా మొదటి వర్గీకరణని అనుసరించాల్సిందే కదా? అందుకే, వంటవాడికి లాగే, తాత్వికుడికి కూడా మొదటవేటు ఎక్కడ వెయ్యాలనేది ప్రధానమైన సమస్య.
ఉదాహరణకి, పొడుగ్గా ఉండే బెండకాయని నిలువుగా తరిగితే, కూర పాడైపోతుంది. బెండకాయలోని జిగురంతా కూరలోకి పోయి బంక, బంకగా తయారవుతుంది. అలాగే, మిరపకాయని నిలువుగా తరిగితే, అందులో గింజలన్నీ బయటపడి, కారం ఎక్కువైపోతుంది. ఉల్లిపాయని సన్నగా తరగాలంటే, మెదట నిలువుగా తరుక్కోవాలి, అడ్డుగా కోస్తే ‘చెక్కు’ చెయ్యటం కష్టం. అదే సాంబారులోకి పెద్ద ముక్కలు కావాలంటే, అడ్డంగా కోసుకోవాలి – ఎందుకంటే, నిలువుగా కోస్తే, ఉడికినప్పుడు పాయలు, పాయలుగా విడిపోతుంది. అవునా?
ఎలాగూ ఫిలాసఫీలో పడ్డాం కాబట్టి, అసందర్భమైనా, కూరలు తరగడానికి కూడా ఒక థియరీ చెప్పేడొక పాకశాస్త్ర ప్రావీణ్యుడొకసారి. కొన్నాళ్ళు పెద్ద ఎత్తులో – అంటే పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు లాటి వాటికి - వంటలు చెయ్యడం నేర్చుకొందామని ఓ పెద్దాయన దగ్గర శుశ్రూషకి కుదురుకొన్నా. ఆయన చెప్పిన రహస్యమేమిటంటే – కూరగాయలు రెండురకాలు. రమణారెడ్డిలా సన్నగా, పొడుగ్గా ఉండేవి ఒకరకం, రేలంగిలా బొద్దుగా ఉండేవి రెండోరకం. బొద్దుగా ఉండే కూరగాయలని (ఆనపకాయలు, దుంపలు, కాబేజి లాటివి) ముందు నిలువుగా కొయ్యాలి. ఒకసారి కోసిన తర్వాత కూడా ఇంకా రేలంగిలాగే ఉంటే – ఆ చిప్పని మళ్ళా నిలువుగానే కొయ్యాలి. ఎప్పుడైతే ఆ ముక్కలు రమణారెడ్డిలా అవుతాయో, అప్పుడు వాటిని అడ్డంగా నరుక్కోవాలి. కూరలు తరగడానికి బైనరీ సెర్చి అల్గార్థమ్ అనుకోండి.
గురుడు మనచేతికి చిక్కెడు కదా అనుకొని, మరైతే, కాలిఫ్లవర్నేం చేయ్యాలి ఆచార్యా అనడిగా. దాన్ని, పీక్కోవాలి కదా, తరుక్కోడానికి కుదరదు. ఆయన చిద్విలాసంగా ఒక చిర్నవ్వు నవ్వి – నేను చెప్పిన సూత్రం కాయలకికాని పువ్వులకి కాదు నాయనా అన్నారు. వేడిగా కాలిన మూకుట్లో పడ్డ కూరముక్కలతో పాటే, ఎగరేద్దామనుకొన్న నా కాలరుకూడా చుంయ్ మంది.
కూరలు తరగడంలోనే ప్రధమ వేటుకింత ప్రాధాన్యమున్నప్పుడు – మరి తాత్వికుడికి ఎంత సమస్యొ ఆలోచించండి. అందుకే, ఇంజినీర్లూ, ఆర్కిటెక్ట్‌లు, తాత్వికులు – మొదట వేటు ఎక్కడ వెయ్యాలి అనే దానిగూర్చి చాలా మధన పడుతుంటారు. ఎందుకంటే, ఒక సారి గాని ఆ కత్తి సంపర్కం తగిలితే, ఏ విషయాన్నైతే తాత్వికుడు విచారిద్దాం అనుకొన్నాడో, ఆ విషయ ప్రపంచం అంతా రెండుముక్కలైపోతుంది.
సాఫ్ట్‌వేర్ రూపకల్పన చేసేవారికీ సంగతి బాగా విదితమే – కడదామా, కొందామా (బిల్డ్ వి.సా.వి. బయ్), మైక్రోసాఫ్ట్ వాడి ప్లాట్‌ఫారంతోనా లేక ఓపెన్‌సోర్సా – ఇలాటి ప్రధమ వేటు, ఆ సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ రూప లావణ్య విలాసాలన్నిటినీ శాసిస్తుంది. అలాగే తత్వశాస్త్రంలోనూను.
విషయ ప్రపంచం (యూనివర్స్ ఆఫ్ డిస్‌కోర్స్) లేక తత్వ పదార్ధం – ఎలైస్ ఇన్ వండర్‌లాండ్లో హమ్టీ-డమ్టీ లాటిది. ఒకసారి ఈ హమ్టీ-డమ్టీగాడు గాని పడ్డాడా, పాపం ముక్క చెక్కలైపోతాడు. ఒకసారి ముక్కలైపోతే, రాజుగారు సేనంతా వచ్చినా – ఆయన్ని మరలా తిరిగి అతకలేరు. ఉదాహరణకి భౌతికప్రపంచం అంతా పాంచభౌతికం అన్నామనుకోండి, ఇంక అంతే సంగతులు – అక్కడనుంచి ఇక వెనక్కి పోలేం.
వ్యాసుడు అంటే విభజించినవాడు, వర్గీకరించినవాడు అనే అర్ధం ఉంది కదా. అరిస్టాటిల్ అసలు సిసలు వ్యాసుడు. వ్యాసోత్తముడు. ఈయనగారు విభజించని, వర్గీకరించని, విచారించని విషయం అంటూ లేదు. తనకు ముందున్న సోఫిస్టుల చింతననంతటినీ పాతరేసి, డయలెక్టికల్ పద్ధతి అనే ఓ కత్తిని తయారుచేసేడు సోక్రటీసు, ప్లాటో దానికి సానబెట్టి అరిస్టాటిల్ చేతిలో పెట్టేడు. ఆ కరవాలంతో అరిస్టాటిల్ తత్వాశాస్త్రాన్ని, మాస్క్ ఆఫ్ జోరోలో ఆంథోని బాండ్రియాస్‌లా సర్ర్‌సర్ర్‌మంటూ తత్వశాస్త్రాన్నంతా తరిగిపోగులు పెట్టేడు.
మెదటివేటు ఆయన వేస్తే – ఆ తర్వాత ఫిలాసఫర్లందరూ, ఆయన కోసిన పండునే, ఇంకా ముక్కలు ముక్కలు చేసుకొంటూ పోయేరు. చేతిలో పట్టిన చిన్న పండు కాస్తా, చిన్న, చిన్న ముక్కలైపోయి పళ్లెం నిండుకూ అయిపోయింది.
ఆ రకంగా మొదలైన పాశ్చాత్య చింతనలో ముఖ్యమైన విభాగాలు కొన్నిఉన్నాయి – లాజిక్ (తర్కం), మెటాఫిజిక్స్(పారభౌతిక శాస్త్రం), ఎపిస్టెమాలజి (జ్ఞానమీమాంస), ఎథిక్స్(నీతిశాస్త్రం), ఈస్తటిక్స్(సౌందర్య శాస్త్రం, రామణీయక శాస్త్రం), సైకాలజి (మనస్తత్వ శాస్త్రం), పోలిటిక్స్ (రాజనీతి శాస్త్రం), హిస్టరీ (చరిత్ర). ఎపిస్టెమాలజీ, మెటాఫిజిక్సు నుంచి మిగిలిన విజ్ఞాన శాస్త్రాలన్నీ పుట్టుకొచ్చేయి.
అరిస్టాటిల్ ప్రారంభించిన వర్గీకరణని ఆయన వారసులందరూ – ఒక్కోడూ ఒక్కీ కొమ్మ పట్టుకొని, దాన్ని పీకి, పీకి పెంచి పెద్దదిగా చేసుకొంటూ పోయేరు. అవన్నీ ఇక్కడ అప్రస్తుతం. అయితే, డేకార్త్ అనే ఒక మాహానుభావుడు – ఇప్పుడున్న విజ్ఞాన శాస్త్రాల కవసరమైన వేదికని తయారు చేసేడు. “నేను అలోచిస్తున్నాను కాబట్టి నేనున్నాను” (ఐ థింక్ దేర్‌ఫోర్ ఐ ఆమ్) అనే సుప్రసిద్ధ సుభాషితం డేకార్త్‌దే. రేషనల్‌ఫిలాసఫీకి ప్రాణం పోసింది డేకార్తే.
డేకార్త్ పాశ్చాత్య తత్వశాస్త్రానికి ఒక తార్కిక వ్యవస్థ (సిస్టమ్ ఆఫ్ లాజిక్)ని తాయారు చేసిపెట్టేడు. ఈ వ్యవస్థే తరువాతికాలంలో సైంటిఫిక్-మెథడ్‌గా ఎదిగింది. ఈ వ్యవస్థలో ముఖ్యమైన అంశాలు – ఒకటి సందేహం (డౌట్ లేక హైపోథసిస్), రెండు, తర్కం ద్వారా నిరూపణ (ఆబ్జెక్టివ్ ప్రూఫ్), తర్కించడానికి అవసరమైన సూత్రాలు (ప్రిన్సిపుల్స్ ఆఫ్ రీజనంగ్). ప్రపంచంలో ప్రసిద్ధికెక్కిన ముఖ్యమైన మతాలు ఎంతగా మానవాళిమీద ప్రభావం చూపేయో, డేకార్త్ తాత్విక సిద్ధాంతము, మార్క్ ప్రతిపాదింజిన కమ్యూనిజం కూడా అంతగానే ప్రపంచ భవితవ్యాన్ని శాసించేయనడం అతిశయోక్తి కాదేమో.
డేకార్త్ మానవుడి చేతనావస్థలో బుద్ధివ్యాపారానికి (కాగ్నెటివ్ ప్రాసెసిస్) పెద్దపిటవేసేడు. డేకార్త్ సిధ్ధాంతంలో సౌకర్యమేమిటంటే – సందేహం నుంచీ, నిరూపణ దాకా ఉన్న మెత్తం ప్రక్రియ అంతా సిద్ధాంత పరమైనదే. ఇందులో, ఎవరు చెప్పేరు అన్నది పూర్తిగా అప్రస్తుతం. ఒక సారి నిరూపించబడితే, ఎవరైనా సరే ఒప్పుకు తీరాల్సిందే, మరో దారిలేదు. అనుభవం మీద ఆధారపడే పద్ధతులలో ఈ వెసులుబాటు లేదు. ఉదాహరణకి, ఆథ్యాధ్మక సిద్ధాంతాలు – ఎక్కువగా ఇన్‌ట్యూషన్ (అంతఃప్రభోధం) మీద, అనుభవం మీద ఎక్కువగా ఆధారపడతాయి. వాటిల్లో తర్కానికన్నా అనుభూతికే ప్రాధాన్యమిస్తారు. అందుకే, ఎవరు చెప్తున్నారు అన్నది కూడా చాలా ప్రాధాన్యతని సంతరించుకొంటుంది. డేకార్త్ కి సందేహం ఎటువంటితో, ఆథ్యాధ్మిక పద్ధతులలో, విశ్వాసానికి, నమ్మకానికి అటువంటి పాత్ర ఉంటుంది (ఇది పూర్తిగా నిజం కాదనుకోండి). తర్కం సందేహంతో ప్రారంభమై, నిరూపణతో ముగుస్తే, ఇవన్నీ విశ్వాసంతో ప్రారంభమై, జ్ఞానోదయంతో ముగుస్తాయి. అందుకే, నీకు ఇష్టమైతే ఒప్పుకో, కష్టమైతే తప్పుకో అన్నట్లుంటాయి ఈ తరహా తత్వవిచారాలు.
డేకార్త్ సిద్ధాంతంలో ఇలాటివి కుదరవు. ఎవరు చెప్పినా ఒకటే, నిరూపించబడిన విషయం సిద్ధాంతానికి, సైద్ధాంతిక సూత్రాలకి కట్టుబడితే చాలు. ఈ నాటి విజ్ఞాన శాస్త్రాలకి డేకార్త్ ప్రతిపాదించిన రేషనల్ మెథడ్ కీలకమైనది.
ఇందులో ఇంకొక సౌకర్యం ఏమిటంటే, ఏ విషయాన్నైనా ఎవరికైనా భోధించడానికి అనువుగా ఉంటుంది. గురువుమీద పూర్తి విశ్వాసం, శరణాగతి, గురువుకి జ్ఞానోదయమైందా లాటి అంశాలతో పనిలేదు. ఆ కారణం చేత, విద్యాలయాల్లో పెద్ద ఎత్తున భోధించడానికి అనువుగా ఉంటుంది ఈ పద్దతి. సందేహం (తాత్విక పరిభాషలో కార్టీషియన్‌డౌట్ అంటారు), అంతకు ముందు నిర్వచించబడిన, నిరూపించబడిన తార్కిక సూత్రాలు, సిద్ధాంతాలు మీదనే ఏ విచారమైనా, వివేచనైనా ఆధారపడుంటుంది కాబట్టి, ఎవరు చెప్పేరు, వారి జ్ఞానం అనుభవైకవేద్యమేనా కదా లాటి వన్నీ అప్రస్తుతాలు, అసంబద్దాలు కాబట్టి, అందరికీ విజ్ఞానం భోధించడానికి, విజ్ఞానాన్ని పెంపొదించడానికి, పదిలపరచడానికి ఆస్కారం ఉంది కదా. ఈ కారణం చేతనే, పాశ్చాత్య సంస్కృతి, భోధనా పద్దతులు, విజ్ఞాన శాస్త్రాలు ఈ రోజు ప్రపంచమంతా పాతుకుపోయి, మిగిలిన విచారణా, వివేచనా వ్యవస్థలన్నీ (సిస్టమ్స్ ఆఫ్ ఇన్‌క్వయిరి) అన్నీ బూజు పడుతున్నాయి.
ఇన్ని సౌకర్యాలున్నాయి కాబట్టి, డేకార్త్ పుణ్యమా అని బుద్ధి ఒక్కటే, మనిషి యొక్క చేతనావస్థలో అన్నిటికన్నా ముఖ్యమైనదైపోయింది. మిగతావన్నీ – భావోద్రేకాలు, నమ్మకాలు, విశ్వాసాలు, అంతః ప్రభోదాలు లాటివి – తత్వశాస్త్రం నుంచి వెలివేయబడ్డాయి. డేకార్త్ ప్రతిపాదించిన ‘రేషనల్-ఫిలాసఫీ’ ఎంత పకడ్బందీగా ఉంటుంది మరి.
కేవలం బుద్ధివ్యాపారం, తార్కిక వివేచన, విశ్లేషణమీద ఆధారపడ్డ డేకార్త్ రేషనల్‌ఫిలాసఫీలో లోపాలు కూడా చాలానే ఉన్నాయి. మెదటిది, దీంట్లో, ఒక్క బుద్ధికి తప్ప, మిగిలిన వాటికి స్థానంలేదు – కాని, మనిషికి ఒక్క మేధస్సు ఒక్కటే సాధనం కాదుకదా మనుగడ సాధించటానికి, జ్ఞానసముపార్జనకి?
ఇక, అనుభూతిని, మిగతా చేతనావస్థలని విచారించిన సిద్ధాంతాలు చాలా ‘గహనంగా’ (ఏబ్‌స్ట్రాక్టు) ఉంటాయి, వాటిని ఆచరించడానికనువుగా ఉండవు. ఐతే, గత పాతిక సంవత్సరాలలో ఈ రెంటికీ మధ్య సమన్వయం సాధించటానికి చాలా ప్రయత్నాలు జరిగేయి – చాలా రంగాలలో. ఈ విషయాలన్నీ తరువాతి భాగంలో చెప్పుకొందాం.

నల్ల దంతాలు

వియత్నాం లో కొన్ని తెగల వారు, జపాన్ లో హోదా ఉన్నవారు (ముఖ్యంగా ఆడవారు) కొన్ని దశాబ్దాల క్రితం వరకూ దంతాలని నేరేడు పళ్ళ రంగులో నిగనిగ లాడంచేవారనే సంగతి నాకు నిన్న బాల్టిమోరులో ఉన్న దంతవైద్య ప్రదర్శనశాలకి వెళ్ళాకే తెలిసింది. ఈ విషయం మీదే ఒక చిన్న హాస్యోక్తి ఉందిట. వియత్నాంలో జరుగుతున్న ఒక వేడుకలో ఒకానొక ఫ్రెంచి వైద్యుడు ఒక స్ధానిక అధికారితో సంభాషిస్తూ అక్కడే ఆడుతున్న ఫ్రెంచి ఆడవారి అందచందాల గురించి అభిప్రాయం అడిగాడట. అప్పుడా అధికారి పెదవి విరిచి "అంతా బానే ఉంది కానీ వాళ్ళ పళ్ళే కుక్కల పళ్ళలా తెల్లగా ఉన్నాయి" అన్నాడట. పళ్ల విషయం అటుంచితే ఫ్రెంచి వైద్యుడి మొహం మాత్రం తెల్లబోయే ఉంటుంది.

ఈ మధ్యకాలంలో ఇటువంటి పధ్దతులని దాదాపు అందరూ కాలదన్నారు కానీ దంత వైద్యుల పరిశోధన వల్ల వెల్లడైనదేమిటంటే నల్లరంగు పులుముకోవడంవల్ల నోట వెలసేది చిన్న బొగ్గుగనే ఐనప్పటికీ - కనీసం ఇరవై ఏళ్ళు వరకూ చెక్కుచెదరని ఈ రంగుల వల్ల పళ్ళకి క్రిముల బాధ ఉండదని.

Monday, September 3, 2007


దోపిడి దొంగల సంఘం!


(ప్రత్యేక ప్రతినిథి)

విలేకరుల పేరిట దోపిడీలకు పాల్పడుతున్న వారంతా కలిసి విశాఖలో సంఘంగా ఏర్పడ్డారు. ఈమధ్యే వాళ్లంతా సమావేశం కూడా అయ్యారండోయ్. సమావేశం అవడమే కాదు, సంఘనికి కొత్త నాయకత్వాన్ని కూడా ఎన్నుకున్నారు. అయితే, ఎంపికైన వారిలో ఎంతమంది ఎడిటర్లో, ఎంతమంది సంపాదకులో అంతుచిక్కక సంఘంలోని నిజమైన జర్నలిస్టులు అవకాశం దొరికిన చోటల్లా గుసగుసలాడుకుంటున్నారు. అదేం పాపమో తెలియదు కానీ నిజమైన జర్నలిస్టులకు ఆ సంఘంలో చోటే కరువైంది. రాని పత్రికలకు ఇచ్చిన ప్రాధాన్యత నిత్యం వస్తున్నవాటికి ఇవ్వలేదన్న అపవాదు సరేసరి! వేర్వేరు పేర్లతో ఇప్పటికే విశాఖలో రాజ్యమేలుతున్న ఎర్నలిస్టుల సంఘాల జాబితాలో ఇది కూడా చేరిందిలే అని సరిపెట్టుకోవాలా? లేక సరికొత్త లక్ష్యంతో ఆవిర్భవించిన ఈ సంఘాన్ని అభినందించాలో మీరే ఆలోచించండి!