Tuesday, September 4, 2007

నల్ల దంతాలు

వియత్నాం లో కొన్ని తెగల వారు, జపాన్ లో హోదా ఉన్నవారు (ముఖ్యంగా ఆడవారు) కొన్ని దశాబ్దాల క్రితం వరకూ దంతాలని నేరేడు పళ్ళ రంగులో నిగనిగ లాడంచేవారనే సంగతి నాకు నిన్న బాల్టిమోరులో ఉన్న దంతవైద్య ప్రదర్శనశాలకి వెళ్ళాకే తెలిసింది. ఈ విషయం మీదే ఒక చిన్న హాస్యోక్తి ఉందిట. వియత్నాంలో జరుగుతున్న ఒక వేడుకలో ఒకానొక ఫ్రెంచి వైద్యుడు ఒక స్ధానిక అధికారితో సంభాషిస్తూ అక్కడే ఆడుతున్న ఫ్రెంచి ఆడవారి అందచందాల గురించి అభిప్రాయం అడిగాడట. అప్పుడా అధికారి పెదవి విరిచి "అంతా బానే ఉంది కానీ వాళ్ళ పళ్ళే కుక్కల పళ్ళలా తెల్లగా ఉన్నాయి" అన్నాడట. పళ్ల విషయం అటుంచితే ఫ్రెంచి వైద్యుడి మొహం మాత్రం తెల్లబోయే ఉంటుంది.

ఈ మధ్యకాలంలో ఇటువంటి పధ్దతులని దాదాపు అందరూ కాలదన్నారు కానీ దంత వైద్యుల పరిశోధన వల్ల వెల్లడైనదేమిటంటే నల్లరంగు పులుముకోవడంవల్ల నోట వెలసేది చిన్న బొగ్గుగనే ఐనప్పటికీ - కనీసం ఇరవై ఏళ్ళు వరకూ చెక్కుచెదరని ఈ రంగుల వల్ల పళ్ళకి క్రిముల బాధ ఉండదని.

No comments: